పార్లమెంట్ ఎన్నికల్లో .. కాంగ్రెస్ భూస్థాపితం : కిషన్​రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో .. కాంగ్రెస్ భూస్థాపితం : కిషన్​రెడ్డి
  • ఆ పార్టీ 75 ఏండ్ల పాలన అంతా అవినీతి, కుంభకోణాలే :  కిషన్ రెడ్డి 
  • 6 గ్యారంటీలను ఎగ్గొట్టాలని చూస్తున్నరు 
  • ఓడినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలే.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటదని వ్యాఖ్య

నారాయణపేట, వెలుగు :  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు భూస్థాపితం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ 75 ఏండ్ల పాలనలో అన్నీ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలేనన్నారు. ఒకే కుటుంబం పాలించి దేశాన్ని నాశనం చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు.

బుధవారం బీజేపీ విజయ సంకల్పయాత్రలో భాగంగా నారాయణపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోటీ బీజేపీ, కాంగ్రెస్​పార్టీల మధ్యనే ఉంటుందన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఎజెండా లేదని, ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలకు చేసేది ఏమీ ఉండదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదన్నారు. 

ప్రజల దృష్టిని మళ్లించే యత్నం 

ఎన్నికల సమయంలో కరెంటు బిల్లులు కట్టొద్దని, రైతులు అప్పులు కట్టొద్దని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో, నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్​నేతలు గ్యారంటీలను మరిచిపోయి.. సోనియా కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని, సూట్ కేసులు మోసుకెళ్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని స్వయంగా సీఎం చెప్పడాన్ని బట్టి గ్యారంటీలు ఎగ్గొట్టినట్టే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

ఎవరితోనూ పొత్తు ఉండదు 

రాష్ట్రంలో తాము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో సుస్థిర పాలన, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. పాలమూరు యూనివర్సిటీకి ప్రధాని మోదీ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. అనంతరం పట్టణంలోని ఓ చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి ఆయన మగ్గం నేశారు. పేటలో టెక్స్​టైల్​ పార్క్​ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు.