కేసీఆర్.. బస్తీల్లో మస్తు సమస్యలు : కిషన్ రెడ్డి

కేసీఆర్.. బస్తీల్లో మస్తు సమస్యలు : కిషన్ రెడ్డి

ముషీరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ అభివృద్ధి అంటే హైటెక్ సిటీలో మాత్రమే అన్నట్టు కేసీఆర్​ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధాన రోడ్లకు రంగులు పూసి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగినట్లుగా జనాన్ని మభ్యపెడుతోందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్​మెట్, రాంనగర్ డివిజన్లలో అధికారులతో కలిసి కిషన్ రెడ్డి బుధవారం పాదయాత్ర చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలు ఉండే కాలనీలు, బస్తీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. డ్రైనేజీ, వర్షపు నీటితో రోడ్లు గుంతలమయంగా మారాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ​నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి ఇక్కడి జనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు రవి చారి, సుప్రియ, రచన శ్రీ, దీపిక, బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరి శివాజీ, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆసిఫ్​నగర్​లో పాదయాత్ర

అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ ​నిధులు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్, మల్లేపల్లి డివిజన్లలోని పలు బస్తీల్లో బుధవారం కిషన్​రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు బలం లేని అనేక బస్తీలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. నిధులు లేక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. పాదయాత్రలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, బీజేపీ సీనియర్ నేత భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.