కాంగ్రెస్, బీఆర్ఎస్​ది డూప్ ఫైట్ : కిషన్ రెడ్డి

 కాంగ్రెస్, బీఆర్ఎస్​ది డూప్ ఫైట్ : కిషన్ రెడ్డి
  • ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది
  • రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది
  • కాంగ్రెస్​ది అవినీతి, అక్రమాల చరిత్రని ఫైర్​ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, వాటి మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపిస్తామన్న రేవంత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య డూప్ ఫైట్ కొనసాగుతున్నదని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్క భూములకు సంబంధించిన అక్రమ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి దాకా ఎలాంటి విచారణకు ఆదేశించలేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. కాంగ్రెస్ ది అవినీతి, అక్రమాల చరిత్ర. అందుకే దేశ ప్రజలు ఆ పార్టీని బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నరు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో లేదు’’అని అన్నారు. 

కాంగ్రెస్​ది బ్లాక్​ మెయిలింగ్ పాలిటిక్స్

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ బ్లాక్​ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తున్నది. భూములకు సంబంధించిన లావాదేవీలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పెద్దలకు డబ్బులు సమకూర్చడానికే ఇదంతా చేస్తున్నది.’’అని కిషన్ రెడ్డి ఆరోపించారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తో రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు కలిసి ముందుకు వెళ్లాలని కోరినట్టు సమాచారం. అంతకుముందు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 

పాలమూరు గడ్డ.. నా అడ్డా: జితేందర్ రెడ్డి

పాలమూరు గడ్డ తన అడ్డా అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్​నగర్​ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.