
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి100 లెటర్లు రాశానంటున్న కేసీఆర్... దమ్ముంటే ఆ లేఖలను బయటపెట్టాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవాలని అప్పటి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రానికి లేఖ రాశారు. కానీ కేసీఆర్ స్పందించలేదు. చివరకు నేను కూడా లెటర్ రాశాను. అయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడేమో కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. బుధవారం బీజేపీ మీడియా సెంటర్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘రూ.26 వేల కోట్ల ప్రాజెక్టులో గజం భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించలేదు. అందులో సగం డబ్బులిస్తామన్నా రాష్ట్ర సర్కార్ స్పందించలేదు. రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇస్తే అగ్రిమెంట్ చేసుకుని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెనకడగు వేసింది” అని చెప్పారు. ‘‘కేంద్రం నుంచి నిధులు రానందునే రాష్ట్రంలో పథకాలు అమలు చేయడంలో ఆలస్యమవుతోందని కేసీఆర్ చెప్తున్నవన్నీ అబద్ధం. తలా తోకా లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ 9 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది” అని స్పష్టం చేశారు.
కరెంట్ లెక్కలు తేల్చేందుకే మోటార్లకు మీటర్లు పెట్టుమన్నం..
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమని చెప్పామని, కానీ రైతుల నుంచి బిల్లులు వసూలు చేయుమని తాము ఎప్పుడూ చెప్పలేదని కిషన్ రెడ్డి తెలిపారు. డిస్కంల ద్వారా ఎంత కరెంట్ఉత్పత్తి అవుతోంది? ఎంత పంపిణీ అవుతోంది? కంపెనీలు దొంగతనంగా వాడుకుంటున్న కరెంటు ఎంతో? చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతుల పేరు చెప్పి, ఇతరులకు ఇస్తున్న కరెంటు లెక్కలు తేల్చాలనేదే నిర్మలా సీతారామన్ ఉద్దేశం. ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా? అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు” అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని సవాల్ చేశారు. ‘‘దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఎటుపోయింది? వారికి వెన్నుపోటు పొడిచిన కేసీఆర్.. ఇప్పుడు కొడుకు కేటీఆర్ సీఎం అయినట్లు కలలు కంటున్నారు” అని విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే అవినీతి..
50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్.. రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను దోచుకుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మందిని, మలిదశ ఉద్యమంలో 1,200 మందిని పొట్టన పెట్టుకుందని ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ అంటే అవినీతికి పర్యాయపదం. రూ.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని యూపీఏ హయాంలో దోపిడీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే, అక్కడ దోపిడీ ఉంటుంది. కర్నాటకలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. వందల కోట్ల రూపాయలను తెలంగాణ ఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది. కాంగ్రెస్ కు అవినీతి ఒక వృత్తి, ఒక కళ. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన కాంగ్రెస్ వల్ల ఏ రాష్ట్రానికి మేలు జరగలేదు” అని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఉంటే అస్థిరత.. కాంగ్రెస్ అంటే ఆర్థిక అస్థిరత. బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇక కాంగ్రెస్ వస్తే మరింత విధ్వంసం చేస్తుంది. బీజేపీ వస్తేనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది” అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండూ కూడా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారాయి. అవినీతి, బంధుప్రీతి వాళ్ల నినాదాలు. కుటుంబ జోక్యం, కుటుంబ పెత్తనం లేని ప్రభుత్వాన్ని ఎన్నుకోండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీసీని సీఎం చేస్తామనే దమ్ము.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఉందా?
బీసీని సీఎం చేస్తామని తాము ప్రకటించామని, చేసి తీరుతామని.. ఆ దమ్ము, ధైర్యం బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఉందా? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీలను అవమానిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘మేమిచ్చిన బీసీ సీఎం హామీపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కుల సంఘాల సమావేశాలు పెట్టడంతో పాటు మమ్మల్ని కలిసి మద్దతు తెలుపుతున్నారు” అని చెప్పారు.