జగన్‍ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్‍ ఏం చేసిండు? : కిషన్​ రెడ్డి

జగన్‍ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే  కేసీఆర్‍ ఏం చేసిండు?  : కిషన్​ రెడ్డి
  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్‍ నల్గొండ సభ : కిషన్​ రెడ్డి  
  • ఎంపీ ​ఎలక్షన్స్​ కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్​ జల రాజకీయాలని ఫైర్

వరంగల్‍/హనుమకొండ, వెలుగు:  ఆంధ్రా సీఎం జగన్‍ మోహన్ ​రెడ్డి నాగార్జున సాగర్‍ డ్యామ్‍పై పోలీసులను పెట్టి నీళ్ల దోపిడీ చేస్తుంటే.. ఆనాడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‍ ఏం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్‍ ఎలక్షన్స్​ కోసమే మేడిగడ్డ, కృష్ణా నీళ్ల అంశంతో కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ పార్టీలు జల రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృష్ణా నీటి సమస్య విషయంలో 2014 విభజన చట్టం ప్రకారం కేసీఆర్‍ స్పందించలేదని అన్నారు. జగన్‍, కేసీఆర్‍ మంచి దోస్తులైతే సమస్యపై మాట్లాడుకునేందుకు ఎందుకు ముందుకురావట్లేదని నిలదీశారు. ఈ సమస్యకు చెక్‍ పెట్టేందుకే కేంద్రం కృష్ణా వాటర్‍ డిస్ప్యూట్​ ట్రిబ్యునల్‍ వేసిందని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ‘‘కేసీఆర్‍ గతంలో సెక్రటేరియెట్​కు రాలేదు.. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు.. కానీ, బహిరంగ సభలకు మాత్రం రెడీగా ఉంటారు..”అని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్‍ నల్గొండ సభ పెట్టారని ఆరోపించారు. 

గ్రేటర్‍ వరంగల్​లో మంగళవారం కిషన్​రెడ్డి పర్యటించారు. హనుమకొండలో వరంగల్‍ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలో కల్యాణమండపం పనులను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. గతేడాది అక్టోబర్​లోనే మేడిగడ్డ డ్యామేజీ అంశంపై బీజేపీ తరఫున తాను స్పందించినట్లు కిషన్​రెడ్డి చెప్పారు. పగుళ్లు తమ దృష్టికి వచ్చిన రెండు రోజుల్లోనే కేంద్రం తరఫున జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి అధికారులు, నిపుణుల బృందం వచ్చి పరిశీలించిందన్నారు. 20 అంశాల్లో వారు వివరాలు అడిగితే.. అప్పటి కేసీఆర్‍ సర్కారు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. నేషనల్‍ డ్యామ్‍ సేఫ్టీ అథారిటీ డ్యామ్‍ను ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు. రేవంత్‍రెడ్డి సీఎం అయ్యాక కూడా గడిచిన రెండు నెలల్లో లెటర్లు రాస్తే స్పందించకుండా మేడిగడ్డకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి, నాణ్యతపై దర్యాప్తు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్రం మాత్రం సీబీఐ విచారణ కోరుతూ ఒక్క లెటర్‍ ఇవ్వమంటే ఇవ్వట్లేదని మండిపడ్డారు. రాష్ట్రం వేసిన విజిలెన్స్​ కమిటీకి అవినీతి దర్యాప్తు తప్పితే.. నాణ్యత, డిజైన్‍ లోపం, ఎగ్జిక్యూషన్‍ విషయంలో సమగ్రమైన అధికారాల్లేవని కిషన్​రెడ్డి చెప్పారు. 

 హ్యాట్రిక్ ​పీఎంగా మోదీ

తెలంగాణలో బీజేపీ 17 సీట్లలో విజయం సాధిస్తుందని కిషన్​రెడ్డి జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ హ్యాట్రిక్‍ పీఎం అవబోతున్నారన్నారు. కాంగ్రెస్‍ పార్టీకి ప్రస్తుతమున్న 40 సీట్లు కూడా రావన్నారు. బీఆర్‍ఎస్‍ పార్టీకి ఓటెస్తే.. మూసి నదిలో వేసినట్లేనని అన్నారు. కవిత లిక్కర్‍ స్కాం విషయంలో మాట్లాడుతూ.. అవినీతిచేసేవారు సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైనా వదిలే ప్రసక్తి ఉండదని పేర్కొన్నారు. 

ఫిబ్రవరిలో కల్యాణ మండపం రీ ఓపెనింగ్‍

హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులు 99 శాతం పూర్తయ్యాయని కిషన్‍రెడ్డి వెల్లడించారు. వారంలోపు మిగిలిన పనులు పూర్తిచేసి ఫిబ్రవరి నెలాఖరులో మండపాన్ని భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అదేరోజు వరంగల్‍ కోటాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్​లైట్లను ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి పేరుతో నాటి పాలకులు 15 ఏండ్లుగా శిల్పకళాసంపదను మూలకుపెట్టారని విమర్శించారు. మండపం పునఃనిర్మాణానికి కేంద్రం తరఫున తాను ప్రత్యేక చొరవ చూపినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రైబల్‍ సర్క్యూట్‍లో భాగంగా ఉమ్మడి ఓరుగల్లులో పర్యాటకరంగాన్ని డెవలప్‍ చేస్తున్నట్లు చెప్పారు. ములుగులో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి.. విద్యా సంవత్సరం ఇదే ఏడాదినుంచి మొదలయ్యేలా ప్రధాని ఆలోచన చేస్తున్నారన్నారు. రామప్పకు యునెస్కొ సాధనకు కృషి చేసినట్లే.. మేడారం జాతర నిర్వహణకు సైతం కేంద్రం తరఫున సహకారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన కొత్త నిర్మాణాలు చేపట్టి రాష్ట్రానికి అప్పజెప్పనున్నట్లు వివరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి, హనుమకొండ, వరంగల్‍ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్‍ తదితరులు పాల్గొన్నారు.