కల్వకుంట్ల కుటుంబానికి మమ్మల్ని ప్రశ్నించే హక్కుందా?

కల్వకుంట్ల కుటుంబానికి మమ్మల్ని ప్రశ్నించే హక్కుందా?

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మార్పు బీజేపీతో సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని.. అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి జనాలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. హర్యానా, బిహార్, కర్నాటక లాంటి అనేక రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు.

‘రూ.67 వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా రూ.67 వేల కోట్లు ఖర్చు పెడితే ఇటీవల వర్షాలకు హైదరాబాద్ సముద్రంగా ఎందుకు మారింది? ఐదున్నర లక్షల ఇళ్లల్లో వరద నీరెందుకు వచ్చింది? ప్రజలందరూ బురదలో ఎందుకు చిక్కుకున్నారు? ఈ రూ.67 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? ఎందుకు కలుషితమైన నీళ్లు తాగాల్సిన పరిస్థితి తలెత్తింది? ఎందుకు నగర రోడ్లు గుంతలమయంగా మారాయి? ఛేంజ్ హైదరాబాద్‌‌ కింద వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ అరాచకం తీసుకొస్తుందని కేటీఆర్ అంటున్నారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

‘దేశంలో 80 శాతం మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మేం అరాచకం తీసుకొస్తున్నామా? మత కలహాలు, కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేనటువంటి సమర్థవంతమైన భారత నిర్మాణం ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతోంది. దీన్ని మీరు అరాచకం అంటున్నారా? బీజేపీ అరాచకత్వాన్ని తీసుకొచ్చే పార్టీ కాదు.. అరాచకాన్ని అణచివేసే పార్టీ. విధ్వంసాన్ని కూకటి వేళ్లతో అణచివేసే పార్టీ. ఈ దేశంలో హిందూ దేవుళ్లను, హిందూ పండుగలను అవమానపరిచే వ్యక్తులను పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నికల ప్రణాళికలు రూపొందించే కల్వకుంట్ల కుటుంబానికి మమ్మల్ని ప్రశ్నించే హక్కుందా? మేం శాంతి కాముకులం. మేం అభివృద్ధి కాముకులం. ఛేంజ్ హైదరాబాద్ దిశగా మనందరం ముందుకెళ్లాలి. ఛేంజ్ హైదరాబాద్ కోసం ప్రజలు ముందుకు రావాలి. ప్రజల కోసం బీజేపీ ముందుకు వస్తుంది’ అని కిషన్ రెడ్డి వివరించారు.