పేదోడి ఇల్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం: కిషన్ రెడ్డి

పేదోడి ఇల్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం: కిషన్ రెడ్డి
  • ముందు మాపైకి బుల్డోజర్లు తీసుకొచ్చి..ఆ తర్వాత పేదల ఇండ్లు కూల్చండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • అనాలోచిత నిర్ణయాలు ఆపి..మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని డిమాండ్

మెహిదీపట్నం, వెలుగు: పేదోడి ఇల్లు కూలుస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని, బాధితుల పక్షాన నిలుస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అనేక సంవత్సరాలుగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్న పేద ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

పేద ప్రజలను ఈ ప్రాంతం నుంచి వేరుచేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలకు తెగించైనా వారి ఇండ్ల కూల్చివేతలను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ముందు తమపైకి బుల్డోజర్లు తీసుకొచ్చి.. ఆ తర్వాత పేదల ఇండ్లు కూల్చివేయాలన్నారు. శనివారం  మూసీ పరీవాహక ప్రాంతాలైన రాందేవ్ గూడా, లంగర్ హౌస్, జియాగూడలో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు పేదల ఇండ్లు కూల్చకుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలెవరూ తమకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేదని.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 

ముందు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి..

గతంలో కేసీఆర్ మూసీ నదిని కొబ్బరినీళ్లతో నింపుతామని ప్రకటించి, అడ్రస్ లేకుండా పోయారని.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లు కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నడని కిషన్​రెడ్డి విమర్శించారు. వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్, జీహెచ్ఎంసీ.. సిటీలోని షామీర్ పేట, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు డ్రైనేజీ వాటర్ ను మూసీలో కలుపుతున్నాయని, డ్రైనేజీ మళ్లింపు లేకుండా లక్షల కోట్లు ఖర్చుపెట్టినా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. ముందుగా ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, పైపులైన్లు నిర్మించి, ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.  మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి, ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి కిషన్​రెడ్డి సూచించారు.