కాచిగూడలో కమిటీ హాల్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

కాచిగూడలో కమిటీ హాల్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్‌ను ప్రారంభించారు. తక్కిజైల్ ధోబీ ఘాట్‌లో ఎంపీ లాడ్స్ నిధులైన రూ. 14.50 లక్షలతో ఏర్పాటుచేసిన కమిటీ హాల్ భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘గతంలో దత్తాత్రేయ ధోబీ ఘాట్‌లో భవనాల కోసం ఎంపీ లాడ్స్ నుంచి రూ. 54 లక్షలు విడుదల చేశాం. వాటిలో రూ. 14.50 లక్షలతో భవనాన్ని ప్రారభించుకున్నాం. గతంలో అంబర్‌పేట్ మోహిని చెరువు దగ్గర అద్భుతమైన ధోబీ ఘాట్ నిర్మించుకున్నాం. అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి వీరన్న గుట్టలో ధోబీ ఘాట్ నిర్మించుకున్నాం. చాలా మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ధోభీ ఘాట్‌లను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో ధోబీ ఘాట్‌లను ప్రారభించుకున్నాం. హైదరాబాద్‌లో ఉన్న ధోబీ ఘాట్‌లను నిరంతరం పరిశీలిస్తూ.. వాటి అభివృద్ధి కోసం రజక సంఘం నగర అధ్యక్షులు నర్సింహా పనిచేస్తున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఇతర పనులు వెంటనే ప్రారంభించుకోవాలి. అంబర్ పేట ఫ్లై ఓవర్ పనులు భూసేకరణ కారణంగా కొంచెం ఆలస్యం అయినా...  త్వరలో ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. రానున్న కాలంలో  కరోనాను ఓడించి సకాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.