
తెలంగాణలో బీఆర్ఎస్ పై యుద్ధం మొదలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇళ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50లక్షల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాద్యత తనదేనన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.పేదల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కట్టిన ఇళ్లు కూడా ఎవరికి ఇవ్వడం లేదన్నారు. తొమ్మిది సంవత్సరాలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని విమర్శించారు.
కేసీఆర్ అపద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న తనను వెంబడించి అరెస్ట్ చేశారని అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇళ్లను పరిశీలించడానికి వెళ్తున్న తనను కారణం లేకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తానేమైనా ఉగ్రవాదినా? నేరస్థుడినా అని ప్రశ్నించారు. పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. రీజన్ లేకుండా బీజేపీ ఆఫీసుల చుట్టూ, నేతల ఇళ్ల చుట్టు వందలాది పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. నేతలను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలన్నారు.