బీఆర్ఎస్,  కాంగ్రెస్  .. డైవర్షన్ ​పాలిటిక్స్ చేస్తున్నయ్ : కిషన్​ రెడ్డి

బీఆర్ఎస్,  కాంగ్రెస్  .. డైవర్షన్ ​పాలిటిక్స్ చేస్తున్నయ్ : కిషన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకే అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ పాలననే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. గురువారం సికింద్రాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేత పీఎల్ శ్రీనివాస్ ఆయన కూతురు అలేఖ్యతో కలిసి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందన్నారు. స్టేట్​లో ఎక్కడికి వెళ్లినా.. ఈసారి తమ ఓటు బీజేపీకి, మోదీకే వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారన్నారు. మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు బీజేపీని బలపర్చాలని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ స్టేట్ ఆఫీసులో  సేవాలాల్ జయంతి

బీజేపీ స్టేట్ ఆఫీసులో సంత్ సేవాలాల్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటీష్ పాలకులు అధికార దుర్వినియోగంతో మత మార్పిడులకు పాల్పడ్డారని, దానికి వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాడారని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. సేవాలాల్​ జయంతిని బీజేపీ దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని, బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.

పని చేయకుంటే తప్పుకోండి

ఈ నెల 20 నుంచి వచ్చే నెల 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న రథయాత్రలను సక్సెస్​ చేయాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. పనిచేయని వారు తప్పుకోవాలని కోరారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన మీటింగ్​లో కిషన్ రెడ్డితో పాటు పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఇతర నేతలు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ యాత్రలను ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని, వీటి ప్రభావం ఎంపీ ఎన్నికలపై ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన ఆ పార్టీ.. ఒకే రోజు యాత్రలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.