
- కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
- లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు
ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతిని లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆమె విగ్రహం వద్ద నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరై.. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దొరల గడీలను గడగడలాడించి, నిజాం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఐలమ్మ పిలుపునిచ్చి పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అని లక్ష్మణ్ కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ఎమ్మెల్యే ముఠాగోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్ రచనశ్రీ, రజక అభివృద్ధి సంస్థ స్టేట్ చైర్మన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తార్నాకలో..
సికింద్రాబాద్ : తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రజక మహిళా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై ఐలమ్మ ఫొటోకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని నెలకొల్పి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదో ఒక జిల్లాకు ఆమె పేరు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.