ఢిల్లీకి సూట్​కేసులు మోస్తున్నరు: కిషన్ రెడ్డి​

ఢిల్లీకి సూట్​కేసులు మోస్తున్నరు: కిషన్ రెడ్డి​

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీల అమలును పక్కనపెట్టి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ సర్కారు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి రాష్ట్రానికి సూట్ కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో వైసీపీ నేత వెల్లాల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. ఆరు గ్యారంటీలను మాత్రం అమలు చేయడం లేదన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం కాంగ్రెస్​లా కాదు. చేసేదే చెప్తుంది.. చెప్పేది చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావుకు భారత రత్న ఇచ్చి మోదీ ప్రభుత్వం గౌరవించింది. పీవీ చనిపోతే.. ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి అప్పటి కాంగ్రెస్​ పార్టీ రానివ్వలేదు. ఆయనకు స్మృతి వనం నిర్మించలేదు. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనివ్వలేదు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్​కు పంపిన చరిత్ర కాంగ్రెస్​ది” అని కిషన్  రెడ్డి అన్నారు.

మోదీతోనే తెలంగాణ అభివృద్ధి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ అవినీతి, కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీనే కాబట్టి.. బీఆర్ఎస్, కేసీఆర్​పై దర్యాప్తు చేసేందుకు ధైర్యం లేదన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని తాము డిమాండ్​ చేస్తే.. విజిలెన్స్ పేరుతో లేట్​ చేస్తున్నదన్నారు. ‘‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్​ స్టేషన్​, రూ. 450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా.. పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలన్నా మోదీ నాయకత్వం.. బీజేపీ నాయకత్వం అవసరం” అని కిషన్ పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కశ్మీర్​లో 370 ఆర్టికల్​ ఎత్తేసి.. శాంతి నెలకొల్పిందని చెప్పారు.