
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నేతల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన రైల్వే సర్వీసు ప్రారంభ కార్యక్రమం సందర్భంగా మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విధ్వంసం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్కి ప్రజల్లో రోజురోజుకూ తగ్గుతున్న ఆదరణ, బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం కారణంగానే అధికార పార్టీలో అభద్రతాభావం పెరుగుతున్నదని తెలిపారు. తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైందని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అధికారిక కార్యక్రమంలో మోదీ ఫొటోని చూసి మంత్రి హరీశ్ తట్టుకోలేకపోయారని..అందుకే ఎల్ఈడీ టీవీని కాలితో తన్నారని ఫైర్ అయ్యారు. దురుసు ప్రవర్తనతో రైల్వే అధికారులను కూడా బెదిరించారని పేర్కొన్నారు. మరీ ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకని నిలదీశారు.