అభివృద్ధి ప్రోగ్రామ్​లకు రాని సీఎం తెలంగాణకు అవసరమా : కిషన్​రెడ్డి

అభివృద్ధి ప్రోగ్రామ్​లకు రాని సీఎం తెలంగాణకు అవసరమా : కిషన్​రెడ్డి
  • రాష్ట్రానికి కేంద్రం 9 ఏండ్లలో రూ. 9 లక్షల కోట్లు ఇచ్చింది
  • దీనిపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్​కు బీజేపీ స్టేట్​ చీఫ్​కిషన్​రెడ్డి సవాల్
  • రేపు పాలమూరుకు మోదీ.. 3న నిజామాబాద్ కు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అభివృద్ధికి గత 9 ఏండ్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా కేంద్రం నిధులు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ కు దమ్ముంటే.. అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘తెలంగాణ కోసం కేం ద్రం ఏం చేసిందో నేను చెబుతాను.. రాష్ట్రం ఏ చేసిందో కేసీఆర్​ను చెప్పమనండి. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే చర్చించుకుందాం” అని సవాల్ ​విసిరారు. కేసీఆర్​కు ఆయన కుటుంబంపై, రాజకీయంపై తప్ప ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అక్టోబర్​1, 3 తేదీల్లో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తారని, ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి వివరించారు.

కేసీఆర్​కు సీఎంగా ఉండే అర్హత లేదు..

అక్టోబర్1న మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోదీ రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. తర్వాత ‘‘పాలమూరు ప్రజా గర్జన’’  సభలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమా ల కోసం మోదీ రాష్ట్రానికి వస్తే...హాజరయ్యే ఉద్దేశం లేని కేసీఆర్​కు సీఎంగా ఉండే నైతిక హక్కు లేదన్నారు. ఇలాంటి సీఎం తెలంగాణకు అవసరమా ?, ప్రజ లు అర్థం చేసుకోవాలని కోరారు.

ఇవీ అభివృద్ధి కార్యక్రమాలు

‘‘రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్ – -మహబూబ్‌‌‌‌నగర్ ప్రాజెక్టులో భాగమైన ‘జక్లేర్ -కృష్ణ’ కొత్త రైల్వే లైన్‌‌‌‌ను జాతికి అంకితం చేస్తారు. జాతీయ రహ దారులకు సంబంధించి మోదీ రూ.6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 365 బీబీలో భాగమైన సూర్యాపేట..- ఖమ్మం ఫోర్‌‌‌‌ ‌‌‌‌లేన్‌‌‌‌ను మోదీ ప్రారంభిస్తారు. రూ.2,661 కోట్ల విలువైన.. హసన్ (కర్నాటక) -చర్లపల్లి హెచ్‌‌‌‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌‌‌‌లైన్​ను మోదీ జాతికి అంకితం చేస్తారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్,  స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్,  కమ్యూనికేషన్స్ భవనాలను మోదీ  వర్చువల్​గా ప్రారంభించనున్నారు.

రామగుండం ఎన్టీపీసీలో రూ.6వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను తెలంగాణ ప్రజలకు మోడీ అంకితం చేయనున్నారు. వచ్చే నెల 3న 20 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్​లో భాగంగా రూ. 516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.305 కోట్లతో 348 కిలో మీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన.. ధర్మాబాద్ (మహారాష్ట్ర) -మనోహరాబాద్, మహబూబ్‌‌‌‌ నగర్ -– కర్నూల్ రైల్వే లైన్​ను మోదీ జాతికి అంకితం చేస్తారు. 1200 కోట్లతో 76 కి.మీ మేర నిర్మించిన మనోహరాబాద్– సిద్దిపేట కొత్త రైల్వే లైన్​ను ప్రధాని ప్రారంభించనున్నారు’ అని కిషన్ రెడ్డి చెప్పారు. 

మహిళా రిజర్వేషన్​పై మీరా మాట్లాడేది?

మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్  మాట్లాడటం హాస్యా స్పదం అని జి.కిషన్​ రెడ్డి అన్నారు. మొదటి ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం.. ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. కొత్తగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలని డిమాండ్ చేశా రు. ‘‘కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్ వేదికగా వ్యవసాయ మోటర్లకు మీటర్లుండవని స్పష్టంగా చెప్పినా.. దీనిపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్​లో బండి సంజయ్ ఇంటిపై మజ్లిస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి చర్యలకు బండి సంజయ్ భయపడరని చెప్పారు.