
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతులను పరిరక్షించుకుంటూ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దామని జీ20 దేశాల ప్రతినిధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందని అన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీలోని వారణాసిలో జరుగుతున్న జీ-20 దేశాలు, ఆతిథ్యదేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశంలో శనివారం ఆయన ప్రసంగించారు.
సంస్కృతే అందరినీ ఏకం చేస్తుందని చెప్పారు. విలువలు, భాషలు, కళలు దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని అన్నారు. సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా.. ‘కాశీ కల్చరల్ పాత్‌వే’కు రూపకల్పన జరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాగా, సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టంగట్టడం వంటివి కాశీ కల్చరల్ పాత్ వే’లో ఉన్నాయి.