కేసీఆర్​కు బినామీ నేను కాదు కాంగ్రెస్​ నేతలే : కిషన్ రెడ్డి

కేసీఆర్​కు బినామీ నేను కాదు కాంగ్రెస్​ నేతలే : కిషన్ రెడ్డి
  • ఆయన ఫ్యామిలీ మెంబర్లతో ఆ పార్టీ నేతలకు వ్యాపార సంబంధాలున్నయి
  • కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరమంటే.. వ్యక్తిగత ఆరోపణలా
  • రేవంత్ ఆదాయం.. నా ఆదాయంపై ఎంక్వైరీకి రెడీ
  • తెలంగాణలో బిచాణా ఎత్తేసే పార్టీ బీఆర్ఎస్..
  • ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో అవసరం లేదని విమర్శ

హైదరాబాద్, వెలుగు :  కేసీఆర్ కు బినామీ తను కాదని.. కాంగ్రెస్ పార్టీ నేతలే అని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్లతో బిజినెస్​లు చేసిన వారు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారని తెలిపారు. తను ఎన్నడు కేసీఆర్ ను కలువలేదని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కాళేశ్వరం’ అవినీతిపై సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లెటర్​రాయాలని డిమాండ్ చేస్తే.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు. 

సీబీఐ ఎంక్వైరీ విషయంలో గతంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ ను మాత్రమే తాను గుర్తుచేశాను. కానీ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రులు అహంకారంతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘‘రేవంత్ ఆదాయం ఎంతో.. నా ఆదాయం ఎంతో.. ఆయన ఏ విధంగా సంపాదించారో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు. దీనిపై ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధం” అని సవాల్ విసిరారు. 

కాళేశ్వరం అవినీతిపై పూర్తి వివరాలను ఎంపీ హోదాలో సీబీఐకి ఇస్తానన్న రేవంత్.. సీఎంగా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ మీద అప్పుడు లేని అభ్యంతరాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీల లాబీయింగ్ కు సీఎం లొంగిపోయారని ఆరోపించారు. 

15 రోజుల్లోనే ఫార్మా సిటీపై యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ లేదు. ఇక్కడి ప్రజలకు ఆ పార్టీ అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ బిచాణ ఎత్తేసే పార్టీ. ఆ పార్టీ ఒకటి.. రెండు సీట్లు గెలిచినా సాధించేదేమి లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేసే అవకాశమే లేదు. ఒకవేళ వేస్తే.. ఆ ఓటు మురిగిపోవడం ఖాయం”అని అన్నారు.

ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి

పార్టీలో సంస్థాగత మార్పులపై హై కమాండ్​తో చర్చించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం  ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పలు కమిటీల నియామకంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శుక్రవారం కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉండటంతో కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.