
బషీర్‌బాగ్/పద్మారావునగర్, వెలుగు: హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన మల్టీ లేజర్ లైట్అండ్సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్ సిటీకి తలమానికమని, రోజూ వేలాది మంది ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. హైదరాబాద్ కీర్తిని మరింత పెంచేలా లేజర్ లైట్అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులతో ఈ షోను ఏర్పాటు చేసిందన్నారు. కోహినూర్ డైమండ్ చరిత్రను లేజర్ షో తెలుసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ షో రెగ్యులర్ గా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఒకేసారి వెయ్యి మంది వీక్షించేలా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేశామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ...లేజర్‌షో హైదరాబాద్‌కు మణిహారంగా ఉంటుందన్నారు. ప్రపంచానికి మన వారసత్వ సంపదను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మూసీ రివర్ బ్యాటిఫికేషన్తో టూరిజం శాఖలో తన మార్క్ చూపిస్తానన్నారు. సినీ రైటర్ విజయేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్, ప్రముఖ సింగర్ సునీత పాల్గొన్నారు. లేజర్ లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్చేశారు. కేరింతలు కొట్టారు. అలాగే బన్సీలాల్‌పేట డివిజన్లో ఏర్పాటు చేసిన రెండు పవర్‌బోర్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఐడీహెచ్‌కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా బీజేపీ నాయకులు శ్యాంసుందర్, టి.రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.