మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలి .. గెలుపే లక్ష్యంగా పని చేయాలి: కిషన్ రెడ్డి

మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలి .. గెలుపే లక్ష్యంగా పని చేయాలి: కిషన్ రెడ్డి
  • బీజేపీ కార్పొరేటర్ల సమావేశంలో బీజేపీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లకు ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉండడంతో బీజేపీ దృష్టి సారించింది. 

బుధవారం బర్కత్ పురలోని సిటీ బీజేపీ ఆఫీస్​లో గ్రేటర్ కార్పొరేటర్లతో పాటు మరి కొందరు సిటీ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా అయితే పోరాడి విజయం సాధించారో... రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే విధమైన పోరాట పటిమను ప్రదర్శించాలని కోరారు. వికసిత్ భారత్ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలన్నారు. 

ఆరు గ్యారంటీల పేరుతో జనాలను మోసం చేస్తున్నరు

బషీర్ బాగ్, వెలుగు: విధి విధానాలు లేని ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని స్టేట్‌ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో బస్తీ బాట చేపట్టిన కిషన్ రెడ్డి.. బషీర్‌‌బాగ్‌లోని చంద్రనగర్ బస్తీలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరు గ్యారంటీలు, ఇండ్ల నిర్మా ణం కోసం నిధులు ఎలా సమీకరిస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వారి అనుచరులకు కట్టబెట్టి.. లబ్ధిదారులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.