విశ్వకర్మ యోజనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: కిషన్ రెడ్డి

విశ్వకర్మ యోజనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  కిషన్ రెడ్డి

ముషీరాబాద్,వెలుగు:  కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు వివరించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు. ఆదివారం బీజేపీ సిటీ ఆఫీసులో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనకబడిన వర్గాల్లో అర్హులను గుర్తించేందుకు విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

నియోజకవర్గంలో చాలామంది ఓబీసీలు ఉన్నారని, ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్. గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర నేతలు పాపారావు, అంబర్ పేట అసెంబ్లీ కన్వీనర్ శ్యామ్ రాజ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమా, రమేష్ యాదవ్   పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు

 సికింద్రాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును బీఆర్ఎస్​కార్యకర్తలకే ఇస్తుందని, అర్హులైన దళితులను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.  ఆదివారం సికింద్రాబాద్​లోని పలు బస్తీల్లో ఆయన పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. రాష్ట్రానికి 80 శాతం ఆదాయం  హైదరాబాద్​నుంచే వస్తున్నా ప్రభుత్వం మాత్రం సిటీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డల్లాస్​, సింగపూర్​, ఇస్తాంబుల్​అని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ఆఫీసులకు కోట్ల విలువైన భూములను కేటాయించుకుంటున్నారని ఆరోపించారు. 

 సిటీలో కొత్తగా నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. రీజినల్​రింగ్​రోడ్డుకు కేంద్రం రూ.25వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు నెలకొన్నా పరిష్కరిస్తానని, ప్రజల కోసమే బీజేపీ పని చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో  మాజీ మేయర్​బండ కార్తీకరెడ్డి, శ్యాంసుందర్ గౌడ్ , మేకల సారంగపాణి, నాగేశ్వర్ రెడ్డి , సతీష్ గౌడ్, ఆదం విజయ్ కుమార్, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నాలుగు రైళ్ల పొడిగింపు

 రాష్ట్రంలో వివిధ  ప్రాంతాలకు నడిచే నాలుగు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఇందులో 3 ఎక్స్​ప్రెస్​ రైళ్లు, ఒక ప్యాసింజర్​ ఉన్నట్టు ప్రకటించింది. వీటి సర్వీసులు సోమవారం నుంచి అందుబాటులోకి రానుండగా..  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. జైపూర్​– కాచిగూడ వరకు నడిచే జైపూర్​వీక్లీ ఎక్స్​ప్రెస్​ను ఏపీలోని కర్నూలు వరకు పొడిగించగా.. గద్వాల, మహబూబ్​నగర్​,షాద్​ నగర్​లో  హాల్టింగ్ ఉంటుంది. 

హైదరాబాద్​-– హడప్సర్​(పుణె) ట్రై వీక్లీ ఎక్స్​ప్రెస్​ను భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.హెచ్​ ఎస్​నాందేడ్​-– తాండూరు- పర్బణి ఎక్స్​ప్రెస్​ను సేడం, యాద్గిర్​ మీదుగా రాయచూర్​ వరక పొడిగించారు. కరీంనగర్​– -నిజామాబాద్​ మధ్య నడిచే  కరీంనగర్​– ప్యాసింజర్​ రైలును బోధన్​ వరకు పొడిగించారు.