రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు సహకరించట్లే: కిషన్ రెడ్డి

రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు సహకరించట్లే: కిషన్ రెడ్డి
  • స్టేట్​లో రైల్వే ప్రాజెక్టులకు రూ.83 వేల కోట్లు కేటాయింపు
  • రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్ల 700 కి.మీ. రైల్వే పనులు ఆగాయని వెల్లడి

హైదరాబాద్/ పద్మరావునగర్, వెలుగు: “రాష్ట్రంలో రైల్వే డెవలప్ మెంట్ పనులకు తొమ్మిదేండ్ల నుంచి కేంద్రం నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కొత్త రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణలో తీవ్ర ఆలస్యం చేస్తోంది. అయినప్పటికీ కేంద్రం ఫండ్స్​రిలీజ్​చేస్తుండడంతో దశాబ్దాల తరబడి గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలో 2014 నుంచి  రైల్వే అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెరిగింది..” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

ఆదివారం హైదరాబాద్​కవాడిగూడలోని సీజీవో టవర్స్ లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై  57 పేజీల డాక్యుమెంట్ ను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ ను డెవలప్ చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో నేషనల్ హైవేస్ విస్తరణతో పాటు రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తోందన్నారు. కానీ, త్రిబుల్ ఆర్, ఓఆర్ ఆర్ దగ్గర్లో రైల్ నెట్ వర్క్ కు భూసేకరణలో రాష్ట్ర సర్కారు ఆలస్యం చేస్తోందన్నారు. 

రాష్ట్ర  ప్రభుత్వ నిర్లక్ష్యం, సహాయ నిరాకరణ కారణంగా 2022 లో దాదాపు 700 కిలో మీటర్ల రైల్వే లైన్ల విస్తరణ పనులు నిలిచిపోయాయని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. మోదీ సర్కార్​ రాకముందు 2014 వరకు ఏడాదికి  సగటున రాష్ట్రంలో కేవలం 17.4 కిమీ రైల్వే లైన్ల నిర్మాణం మాత్రమే జరిగేదని, మోదీ వచ్చాక 55 కిలో మీటర్ల మీర రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్రం రూ.2,300 కోట్ల నిధులు శాంక్షన్ చేసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కనీసం రైలు కూత వినని మారుమూల ప్రాంతాలకు సైతం రైలు కనెక్టివిటీ చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. 

కొత్త ప్రాజెక్టుల సర్వేకు కేంద్రం అంగీకారం

రాష్ట్రంలో 15 కొత్త ప్రాజెక్టుల ఫైనల్​ లొకేషన్​ సర్వే(ఎఫ్ఎల్ఎస్) కు కేంద్రం ఓకే చెప్పిందని కిషన్ రెడ్డి వెల్లడించారు . సర్వే పూర్తవగానే డీపీఆర్​ల పనులు ప్రారంభిస్తామన్నారు. ఎఫ్ఎల్ఎస్ లో 15 ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి మొత్తం విలువ  రూ.83,543 కోట్లు అని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం కేవలం రూ.10,192 కోట్లతో తెలంగాణకు 5 ప్రాజెక్టులు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టనున్న  ఓఆర్ఆర్.. డెవలప్​మెంట్​లో గేమ్​ చేంజర్​ అని పేర్కొన్నారు. 

ఎంఎంటీఎస్ ఫేజ్​ 2 కింద ఘట్​ కేసర్​ నుంచి యాదాద్రి వరకు రైల్వే లైన్​ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో కేంద్రమే వంద శాతం నిధులను ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని భద్రాచలం, రామప్ప,  సమ్మక్క-సారలమ్మ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు రైల్ ట్రాక్ విస్తరణ, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యాల్యూ ఇచ్చేలా రైల్వే లైన్లను డిజైన్​చేసి.. ప్రజలకు మరింత మేలు చేయటమే ప్రధాని సంకల్పమని కిషన్ రెడ్డి తెలిపారు.