నేటి నుంచి బీజేపీ రచ్చబండ

నేటి నుంచి బీజేపీ రచ్చబండ
  • 25 వరకూ అన్ని జిల్లాల్లో నిర్వహణ 
  • హామీలను కాంగ్రెస్ అమలు చేస్తలే

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్  ఇచ్చిన హామీల అమలు, రుణమాఫీపై జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి 25 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడానికి కార్యాచరణ  రూపొందిస్తోంది. మంగళవారం బీజేపీ స్టేట్  ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కూడా హర్  ఘర్  తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలన్నారు.

కాంగ్రెస్  పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయడం లేదన్నారు. బీజేపీ స్టేట్  ఆఫీసులో ఏర్పాటు చేసిన రుణమాఫీ కాల్ సెంటర్ కు రోజూ వేల సంఖ్యలో రైతులు కాల్  చేస్తున్నారని చెప్పారు.   బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 8, 9వ తేదీల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమం చేపడతామన్నారు. కాగా, బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మాత్రమే హాజరయ్యారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ కూడా అటెండ్  కాలేదు.