
- ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఎమ్మెల్యే ద్వారా పంపిణీ
హైదరాబాద్, వెలుగు: గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచ్ మోకులను పంపిణీ చేయనుంది. ఈ నెల 5న స్టార్ట్ అయ్యే స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ్ మోకులను అందించనున్నారు. మొత్తం100 నియోజకవర్గాల్లో 10వేల కిట్ లు పంపిణీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరగనుందని చెప్పారు. దీని కోసం ఇటీవల బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గత నెల 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కాటమయ్య రక్షణ కిట్లను ఇచ్చారు. స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా భాగంగా పంపిణీని కొనసాగించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రమాదాల్లో 775 మంది గీత కార్మికులు మరణించారు. 1974 మంది గాయాలపాలయ్యారు. మొత్తం 5480 మంది గీత కార్మికులకు 65. 56 కోట్లను ప్రభుత్వం పరిహారం చెల్లించారు. కాటమయ్య రక్షణ కవచ్ కిట్ లతో ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.