Rinku Singh out of KKR: రాబోయే ఐపీఎల్ (IPL 2027) సీజన్ ట్రేడ్ విండో సమయానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడిపై ఆసక్తికరమైన వార్తలు మొదలయ్యాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య ఒక పెద్ద ట్రేడ్ జరిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. గుజరాత్ జట్టుకు మిడిల్ ఆర్డర్లో మ్యాచ్‌ను గెలిపించే రింకూ సింగ్ లాంటి హార్డ్ హిట్టర్ అవసరమని, అయితే రింకూను వదులుకోవడానికి కేకేఆర్ తేలికగా అంగీకరించదని అతడు చెప్పుకోచ్చాడు.
సిరాజ్‌ను ఇస్తేనే రింకూను వదులుకుంటాం:
తన యూట్యూబ్ ఛానెల్లో ఆకాశ్ చోప్రా (Aakash Chopra) మాట్లాడుతూ.. ఈ రెండు జట్ల మధ్య ఆటగాళ్ల ఎక్స్చేంజ్ ఎలా ఉండవచ్చో వివరించారు. గుజరాత్ టైటాన్స్ జట్టు రింకూ సింగ్ లేదా రమణ్‌దీప్ సింగ్‌లను తమ వైపు తీసుకోవాలని భావిస్తే, కేకేఆర్ యాజమాన్యం దానికి ప్రతిఫలంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ఇవ్వాలని కోరుతుంది. అయితే గుజరాత్ కూడా సిరాజ్‌ను వదులుకోవడం సులభం కాదు. ఒకవేళ సిరాజ్ (Mohammed Siraj) డీల్ కుదరకపోతే యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌తో పాటు మరొక ఆటగాడిని కలిపి ఆఫర్ చేస్తేనే కేకేఆర్ నుంచి రింకూను తీసుకోవడం సాధ్యమవుతుందని చోప్రా విశ్లేషించారు.
అహ్మదాబాద్ మైదానంలో రింకూ రికార్డు!
గుజరాత్ టైటాన్స్ జట్టులోకి రింకూ సింగ్ (Rinku Singh) వస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే రింకూ సింగ్ గతంలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం అహ్మదాబాద్ పిచ్ రింకూకు బాగా సరిపోతుందని, కానీ ఒక మంచి భారత ఫాస్ట్ బౌలర్‌ను పొందే వరకు కేకేఆర్ తమ స్టార్ ఫినిషర్‌ను అంత తేలికగా వదులుకోదని చోప్రా స్పష్టం చేశారు.
