
హైదరాబాద్, వెలుగు: రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు మంగళవారం తెలిపారు. డీలర్లు తమ 22 డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకు దిగారని, కొన్ని నెలలుగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. 3 నెలల నుంచి రేషన్ డీలర్లకు రావాల్సిన కమీషన్ను ప్రభుత్వం చెల్లించలేదని, వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
గతంలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులను పంపిణీ చేసేవారని, అప్పుడు కొంత ఎక్కువగా కమీషన్ వచ్చేదని కానీ ఇప్పుడు ఒక్క బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారన్నారు. దీంతో రూ.8,000కు మించి కమీషన్ రావట్లేదని గుర్తుచేశారు. ఈ అరకొర కమీషన్లోనే డీలర్లు హమాలీల ఖర్చు, తరుగు వచ్చే బియ్యం ఖర్చు, గోనె సంచుల ఖర్చులు భరించాల్సి వస్తున్నది. తమిళనాడు ప్రభుత్వం తరహాలో రేషన్ డీలర్లను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకుపోవాల్సిన సివిల్ సప్లయ్ మంత్రి గంగుల కమలాకర్ డీలర్లను అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.