
- కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలు మార్చారు: కోదండరాం
- కలెక్టర్లను కేసీఆర్ రియల్టర్లుగా మార్చిండు: ఆకునూరి మురళి
- తహసీల్దార్స్ అసోసియేషన్ సదస్సులో వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయాన్ని పక్కన పెట్టి సొంత అవసరాల కోసమే రెవెన్యూ చట్టాన్ని మార్చారని, ఆ మార్పుల ప్రతిరూపమే ధరణి పోర్టల్ అని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వంలో జరిగినంతగా భూ విధ్వంసం ఎన్నడూ చూడలేదన్నారు. రెవెన్యూ శాఖ బలోపేతంపై ఆదివారం తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) ఆధ్వర్యంలో, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కోదండరాంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, భూ చట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, ప్రొఫెసర్ జానయ్య, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేత అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. ఏదైనా చట్టం చేస్తే పేదలకు సత్వర న్యాయం జరగాలన్నారు. గత ప్రభుత్వంలో ఇందుకు విరుద్ధంగా జరిగిందని, సొంత లాభం కోసమే రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చారంటూ మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో ఉన్న భూరికార్డులను సైతం ధ్వంసం చేశారన్నారు. వారికి కావాల్సినట్లుగా చట్టాన్ని మార్చుకున్నారని విమర్శించారు. సర్కారు తప్పులకు రెవెన్యూ ఉద్యోగులను శిక్షించడం సరికాదన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి అభిప్రాయం కూడా తీసుకోకుండానే రెవెన్యూ వ్యవస్థకు దూరం చేశారన్నారు. వారు సింహాసనం గానీ, ఫాంహౌస్‌లో భాగం గానీ అడగలేదన్నారు. అధికారులు పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
భూ హక్కులకు సర్కారే గ్యారంటీ..
భూ సమస్యలను తీర్చకుండా ఇతర సమస్యలేవీ పరిష్కారం కావని భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. ప్రపంచ దేశాల్లో భూ సమస్యలు లేని దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయన్నారు. భూ పరిపాలన గ్రామ స్థాయిలోనే ఉండాలన్నారు. భూమి హక్కులకు గ్యారంటీ కూడా గ్రామ స్థాయిలోనే ఇవ్వాలన్నారు. భూమి హద్దులు స్పష్టంగా, హక్కులు కల్పించే పత్రాలు పక్కాగా, హక్కుల మార్పిడి వెంటనే జరిగే వ్యవస్థ ఉండాలని తెలిపారు. భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలన్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాదు.. హక్కులకు రిజిస్ట్రేషన్ కావాలన్నారు.
25 వేల జూనియర్ అసిస్టెంట్లను నియమించాలె
రాష్ట్రంలో 25 వేల జూనియర్ అసిస్టెంట్ల నియామకంతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనిలచ్చిరెడ్డి అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసి గ్రామస్థాయిలోనే అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. జిల్లాలు పెరిగినప్పటికీ ఉద్యోగుల సంఖ్య పెరగలేదని.. ఉద్యోగుల సంఖ్యను పెంచడంతో పాటు ఇతర విభాగాలకు బదిలీ చేసిన వీఆర్ఓ, వీఆర్ఏలను అదే హోదాలో రెవెన్యూ శాఖకు తిరిగి రప్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నేతలు రమేశ్ రాథోడ్, రామకృష్ణ, ఎన్ఆర్ సరిత, టీజీటీఏ అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి ఎస్‌పీఆర్ మల్లేష్‌కుమార్, నేతలు ఉమాశంకర్, పూల్‌సింగ్, రమేశ్ పాక, ఆరేటి రాజేశ్వర్, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్.. తెలంగాణ విధ్వంసకారుడు
మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారుడు కాదని.. తెలంగాణ విధ్వంసకారుడని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, విద్యా, రెవెన్యూ వ్యవస్థలను, టీఎస్‌పీఎస్సీని, గ్రామ పరిపాలనను.. ఇలా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని విమర్శించారు. జిల్లాల్లో కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. అత్యంత అవినీతిపరులైన కలెక్టర్లను తీసుకొచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెలేలు సైతం దొంగలుగా మారి దోచుకున్నారన్నారు. చివరకు రెవెన్యూ ఉద్యోగులను అవినీతిపరులుగా ముద్రవేశారన్నారు. మన రాష్ట్రాన్ని మనమే రక్షించుకోవాలని.. కొత్త దొంగలు తయారవ్వకుండా చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.