కొడంగల్ బీఆర్ఎస్ లో ముసలం... ఇన్చార్జి పట్నం నరేందర్ రెడ్డిపై నేతల తిరుగుబావుటా

కొడంగల్ బీఆర్ఎస్ లో ముసలం... ఇన్చార్జి పట్నం నరేందర్ రెడ్డిపై నేతల తిరుగుబావుటా
  • మాకు వద్దే వద్దంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. నియోజకవర్గ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగరేశారు. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఆదివారం మాజీ లైబ్రరీ చైర్మన్ శాసం రామకృష్ణ, మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, సలీం, చాంద్ పాషా, నర్వోత్తమ్ రెడ్డిలు సమావేశం ఏర్పాటు చేసి నరేందర్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. 

మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో నియోజకవర్గంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించడం వల్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైందన్నారు. నరేందర్ రెడ్డి అధికార పార్టీకి కోవర్టుగా మారారని విమర్శించారు. 

పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకుని పనిచేస్తున్న నిజమైన నేతల్ని పక్కనపెట్టి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానానికి, కేటీఆర్​కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల వరకు నియోజకవర్గ ఇన్​చార్జి బాధ్యతల నుంచి తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు.