
నిన్న రాత్రి నుంచి కోల్‌కతాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇవ్వాళ చాలా ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరగా, వీధులన్నీ నీట మునిగాయి. కోల్‌కతా సహా పరిసర ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. దింతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బైకులు, స్క్యూటర్లు కూడా నీటిలో మునిగాయి.
హౌరాలో వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లు, దుకాణాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల కోల్‌కతాలో విద్యుదాఘాతం కారణంగా సుమారు ఐదుగురు మరణించినట్లు సమాచారం. కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుల్లో ఒకరిని 60 ఏళ్ల జితేంద్ర సింగ్‌గా గుర్తించారు, మిగిలిన వారి గుర్తింపు ఇంకా తెలియలేదు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ బెంగాల్‌లోని చాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పడంతో నగరమంతా మరింత కుండపోత వర్షాలకు సిద్ధమవుతోంది. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (KMC) ప్రకారం, గరియా కమ్‌దహరిలో కేవలం కొన్ని గంటల్లో 332mm, జోధ్‌పూర్ పార్క్‌లో 285mm, కాళీఘాట్ ప్రాంతంలో 280mm, టాప్సియా 275 mm, బాలిగంజ్ 264 mm, ఉత్తర కోల్‌కతాలోని థాంటానియాలో 195mm వర్షం కురిసింది.
మెట్రో సేవలకు బ్రేక్: ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణీకుల భద్రత కోసం కోల్‌కతా మెట్రో షాహిద్ ఖుదిరామ్ - మైదాన్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలను నిలిపివేసింది. మహానాయక్ ఉత్తమ్ కుమార్ నుండి రవీంద్ర సరోబార్ స్టేషన్ మధ్య తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు తెలిపింది. కోల్‌కతా మెట్రో ప్రకారం, దక్షిణేశ్వర్ - మైదాన్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలను తగ్గిస్తూ నడుపుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి మెట్రో రైల్వే అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు.
కోల్‌కతా వాతావరణ సూచన: కోల్‌కతా వాతావరణంపై భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం సెప్టెంబర్ 23 అంటే మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ బెంగాల్‌లోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉత్తర బెంగాల్, తూర్పు & పశ్చిమ మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా, దక్షిణ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ. వేగంతో) వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ బెంగాల్ జిల్లాల్లో IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోల్‌కతాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు / ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, గరిష్టంగా 31˚C కనిష్టంగా 26˚C వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.