V6 News

కోల్ కథ మారలేదు.. ఐపీఎల్‌‌–19లో నాలుగో ఓటమి

కోల్ కథ మారలేదు.. ఐపీఎల్‌‌–19లో నాలుగో ఓటమి
  • 32 రన్స్‌‌ తేడాతో చెన్నై విజయం
  • రాణించిన శాంసన్‌‌, బ్రెవిస్‌‌, ఆయుష్‌‌
  •  నైట్‌‌రైడర్స్‌‌ బ్యాటర్లు ఫెయిల్‌‌

ఐపీఎల్​లో కోల్‌‌కతా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 32 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ చేతిలో ఓటమిపాలైంది. చెన్నై 20 ఓవర్లలో 192 స్కోరు చేయగా.. కోల్‌‌కతా 20 ఓవర్లలో 160/7 రన్స్​ చేసి ఓడింది.

చెన్నై: ఐపీఎల్‌‌–19లో కోల్‌‌కతా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. బ్యాటింగ్‌‌ వైఫల్యంతో నాలుగో మ్యాచ్‌‌లోనూ  ఓడింది. ఛేజింగ్‌‌లో ఏ ఒక్కరూ బ్యాట్‌‌ ఝుళిపించకపోవడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 32 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్‌‌లో సంజూ శాంసన్‌‌ (32 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 48), డేవాల్డ్‌‌ బ్రెవిస్‌‌ (29 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 41), ఆయుష్‌‌ మాత్రే (17 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 38) దుమ్మురేపడంతో.. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. తర్వాత కోల్‌‌కతా 20 ఓవర్లలో 160/7 స్కోరు చేసింది. రమన్‌‌దీప్‌‌ సింగ్‌‌ (37), రొవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (31 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్లు. నూర్‌‌ అహ్మద్‌‌ (3/21)కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

  • స్పిన్నర్లు అడ్డుకున్నారు..

ఫ్లాట్‌‌ పిచ్‌‌పై కెప్టెన్‌‌ రుతురాజ్‌‌ (7) ఫెయిలైనా.. శాంసన్‌‌, మాత్రే మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌లోనే మూడు ఫోర్లతో శాంసన్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించగా, రుతురాజ్‌‌ ఒక్క ఫోర్‌‌ కొట్టి మూడో ఓవర్‌‌లో వెనుదిరిగాడు. 25/1 వద్ద వచ్చిన మాత్రే 4, 4, 4, 6, 6, 4, 4, 4తో విరుచుకుపడ్డాడు. కానీ ఆరో ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు ఔట్‌‌కావడంతో పవర్‌‌ప్లేలో సీఎస్కే 72/2 స్కోరు చేసింది. 

కానీ పవర్‌‌ ప్లే తర్వాత స్పిన్నర్ల రాకతో పరుగుల వేగం తగ్గింది. నరైన్‌‌ (1/21), వరుణ్‌‌ చక్రవర్తి, కార్తీక్‌‌ త్యాగీ (2/35) రెండు సిక్స్‌‌లు, ఒక్క ఫోర్‌‌ మాత్రమే ఇవ్వడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 30 రన్సే వచ్చాయి. ఫలితంగా 102/2 స్కోరుతో తొలి పది ఓవర్లను ముగించింది. అప్పటి వరకు నిలకడగా ఆడిన శాంసన్‌‌ను 12వ ఓవర్‌‌లో త్యాగీ పెవిలియన్‌‌కు పంపడంతో మూడో వికెట్‌‌కు 39 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 

సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ (23), బ్రెవిస్‌‌ బ్యాట్లు ఝుళిపించే ప్రయత్నం చేశారు. సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూనే14వ ఓవర్‌‌లో సర్ఫరాజ్‌‌ 6, బ్రెవిస్‌‌ 4, 4తో 15 రన్స్‌‌ రాబట్టారు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 142/3గా మారింది. 16వ ఓవర్‌‌లో బ్రెవిస్‌‌ 6, 6, 4తో 20 రన్స్‌‌ దంచినా.. 17వ ఓవర్‌‌లో సర్ఫరాజ్‌‌ ఔట్‌‌తో మళ్లీ వేగం మందగించింది. నాలుగో వికెట్‌‌కు 51 రన్స్‌‌ జతయ్యాయి. మరో ఫోర్‌‌ కొట్టి తర్వాతి ఓవర్‌‌లో బ్రెవిస్‌‌ కూడా వెనుదిరిగాడు. శివమ్‌‌ దూబే (13 నాటౌట్‌‌), జెమీ ఓవర్టన్‌‌ (7 నాటౌట్‌‌) హిట్టింగ్‌‌ చేయలేకపోవడంతో చెన్నై స్కోరు రెండొందలు దాటలేదు. వైభవ్‌‌ అరోరా, అనుకూల్‌‌ రాయ్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. 

  • సీఎస్కే బౌలర్లు అదుర్స్‌‌..

ఛేజింగ్‌‌లో కోల్‌‌కతా టాప్‌‌ ఆర్డర్‌‌ విఫలమైంది. రెండో ఓవర్‌‌లో ఫిన్‌‌ అలెన్‌‌ (1)ను ఔట్‌‌ చేసి అన్షుల్‌‌ కాంబోజ్‌‌ (2/32) మొదలుపెట్టిన వికెట్ల పతనాన్ని మిగతా బౌలర్లు సమర్థంగా ముందుకు తీసుకెళ్లారు. వన్‌‌డౌన్‌‌లో నరైన్‌‌ (24), కెప్టెన్‌‌ రహానె (28) ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. ఐదో ఓవర్‌‌లో ఖలీల్‌‌ అహ్మద్‌‌ (1/24).. నరైన్‌‌ను ఔట్‌‌ చేయడంతో పవర్‌‌ప్లేలో కేకేఆర్‌‌ 36/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఫీల్డింగ్‌‌ విస్తరించిన తర్వాత బౌలింగ్‌‌కు దిగిన స్పిన్నర్‌‌ నూర్‌‌ అహ్మద్‌‌ (3/21) నైట్‌‌రైడర్స్‌‌ను ఘోరంగా దెబ్బకొట్టాడు. 

రఘువంశీ (27) లాంగాన్‌‌లో సిక్స్‌‌తో టచ్‌‌లోకి రాగా, 9వ ఓవర్‌‌లో రహానె రెండు సిక్స్‌‌లు బాదాడు. కానీ 10వ ఓవర్‌‌లో రఘువంశీని అకీల్‌‌ హుస్సేన్‌‌ (1/26) బోల్తా కొట్టించాడు. పదో ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో రహానె, కామెరూన్‌‌ గ్రీన్‌‌ (0)ను పెవిలియన్‌‌కు పంపిన నూర్‌‌ అహ్మద్‌‌ 13వ ఓవర్‌‌లో రింకూ సింగ్‌‌ (6)ను ఔట్‌‌ చేశాడు. 11 రన్స్‌‌ తేడాలో నాలుగు కీలక వికెట్లు పడటంతో కేకేఆర్‌‌ 90/6తో కష్టాల్లో పడింది. రొవ్‌‌మన్‌‌ పావెల్‌‌, రమన్‌‌దీప్‌‌ సింగ్‌‌ ఉన్నంతసేపు పోరాటం చేశారు. ఏడో వికెట్‌‌కు 63 రన్స్‌‌ జోడించి రమన్‌‌దీప్‌‌ ఔట్‌‌ కాగా అప్పటికే ఓవర్లు కూడా పూర్తి కావడంతో కేకేఆర్‌‌కు ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 192/5 (శాంసన్‌‌ 48, ఆయుష్‌‌ 38, కార్తీక్‌‌ 2/35). 

కోల్‌‌కతా: 20 ఓవర్లలో 160/7 (రమన్‌‌దీప్‌‌ 35, పావెల్‌‌ 31-*, నూర్‌‌ అహ్మద్‌‌ 3/21).