పశ్చిమ బెంగాల్ లో హింసాత్మకంగా బీజేపీ నిరసన

పశ్చిమ బెంగాల్ లో హింసాత్మకంగా బీజేపీ నిరసన

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చేపట్టిన చలో సచివాలయం నిరసన హింసాత్మకంగా మారింది.కోల్ కతా సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారులను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడులు జరిగాయి. ఇది వివాదాస్పదంగా మారింది. కోల్ కతాలో పోలీసును బీజేపీ జెండాలు పట్టుకున్న ఆందోళనకారులు కర్రలతో చితకబాదిన వీడియో వైరల్ గా మారింది. వారి నుంచి తప్పించుకునేందుకు.. పరిగెత్తినా.. ఆయన వెనకే వెళ్లి దాడికి దిగారు. తర్వాత కొందరు స్థానికులు అడ్డుకోవడంతో.. పోలీసు తప్పించుకున్నారు. ఈ వీడియోపై అధికార టీఎంసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని ట్వీట్ చేశారు. ఇదేనా..పోలీసులకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించిది. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను పోలీసులే రెచ్చగొట్టారని.. బీజేపీ నేతలు స్పందించారు.

పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెడుతున్న క్లోజ్ అప్ వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో పోస్టు చేశారు. సిగరెట్ లైటర్ తో కారుకు వ్యక్తి నిప్పంటిస్తున్న వీడియో బయటకొచ్చింది. దీన్ని షేర్ చేస్తూ.. కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. వారు బీజేపీ కార్యకర్తలు కాదని.. పోలీసులే ఇదంతా.. చేసి ఉండొచ్చన్నారు. బీజేపీ చలో సచివాలయం పిలుపుతో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కోల్ కతాకు తరలివచ్చారు. గతంలో జరిగిన ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని.. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. అయినా బీజేపీ వెనక్కి తగ్గకపోవడంతో.. పోలీసుల ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు.