కట్టింది 15 వేల ఇండ్లు.. ఎంపిక చేసింది ఆరుగురినే

కట్టింది 15 వేల ఇండ్లు..  ఎంపిక చేసింది ఆరుగురినే
  • సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండేండ్ల కిందే డబుల్​ బెడ్రూం ఇండ్లు పూర్తి
  • జీహెచ్​ఎంసీ సహా  నాలుగు జిల్లాల నుంచే 3 లక్షలకు పైగా అప్లికేషన్లు
  • నేటికీ లబ్ధిదారులను ఎంపిక చేయని ఆఫీసర్లు
  • నేడు సీఎం కేసీఆర్ తో ప్రారంభానికి ఏర్పాట్లు
  • ఆరుగురికే ఇండ్ల పట్టాలు..మిగిలినవారికి ఎప్పుడో

సంగారెడ్డి, వెలుగు:   సంగారెడ్డి జిల్లా కొల్లూర్​లో రెండేండ్ల కింద కట్టిన15,660 డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీ కేసీఆర్​ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఈ ఇండ్ల కోసం గ్రేటర్ పరిధిలో 3.5 లక్షల మంది, పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో 15,028 మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారు. రెండేండ్లుగా ఈ లిస్టులతో కుస్తీ పడ్తున్న ఆఫీసర్లు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కేవలం ఆరుగురు లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశారు. ఇన్నాళ్లూ సైలెంట్​గా ఉన్న సర్కారు రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇండ్ల పంపిణీ చేపట్టాలని హడావిడిగా నిర్ణయించింది. ఈ క్రమంలో గురువారం సీఎం చేతుల మీదుగా ఈ డబుల్ ​బెడ్​రూం ఇండ్లను ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల లిస్టులు రెడీ కాకపోవడంతో ఓ ఆరుగురిని ఎంపిక చేసి కేసీఆర్ ​ద్వారా పట్టాలు అందించేందుకు రెడీ అయ్యారు. 

రెండేండ్ల కిందటే డబుల్ బెడ్​రూం​ ఇండ్లు పూర్తి

పటాన్ చెరు నియోజకవర్గంతో పాటు గ్రేటర్ పరిధిలో ఉంటున్న పేదల కోసం కొల్లూరులో ఒకే చోట 145.5 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాకులుగా 15,660 డబుల్​ ఇండ్లను నిర్మించారు. రెండేండ్ల క్రితమే నిర్మాణాలు పూర్తికాగా, గ్రేటర్ పరిధిలో మూడున్నర లక్షలు, పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో 15,028 మంది ఈ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు. నిజానికి గ్రేటర్ లో 7లక్షల అప్లికేషన్లు రాగా, వాటిని మూడున్నర  లక్షలకు కుదించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లా పేదలు కూడా ఉన్నారు. దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ప్రతి వంద మందికి 4 శాతం ఇండ్లు మాత్రమే ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి గతంలో ఇక్కడ పర్యటించి అందరికీ ఇండ్లు వస్తాయని ప్రచారం చేసుకున్నారే తప్ప లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు. 

మరోవైపు దరఖాస్తుదారుల్లో అర్హులెవరో తేల్చేందుకు ఫీల్డ్​ సర్వే చేపట్టాల్సిన జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు అప్లికేషన్ల స్క్రూటినీ కూడా చేయలేకపోయారనే టాక్​ వినిపిస్తోంది. సరిపడా స్టాఫ్​ లేకపోవడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు అంటున్నారు.  దీనికి తోడు లోకల్​ లీడర్ల పైరవీలు పెరిగిపోయాయని చెప్తున్నారు. దీంతో రెండేండ్లుగా లబ్ధిదారుల ఎంపిక ఫైనల్​ చేయలేకపోయారు. ఎంపిక జరగకముందే పలు దఫాలుగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడడంతో కేసీఆర్ ఆదేశాల మేరకు కొల్లూరు ఇండ్ల ప్రారంభోత్సవానికి ఆఫీసర్లు రెడీ అయ్యారు.  ఈక్రమంలో సీఎం చేతుల మీదుగా గురువారం పట్టాలు అందించేందుకు  కేవలం ఆరుగురు లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో మిగిలినవారికి ఎన్నికల్లోగా పట్టాలు ఇస్తారా? ఎలక్షన్ ​తర్వాత అంటూ వాయిదా వేస్తారా అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన.. 

 పటాన్ చెరుకు సాంక్షన్ అయిన సూపర్ స్పెషల్ దవాఖాన నిర్మాణానికి  గురువారం సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం తర్వాత సీఎం  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి శంకుస్థాపన చేసి అక్కడ అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. ఈ దవాఖానకు గత ఏడాది జూలై 16న పరిపాలన అనుమతులు వచ్చాయి. మూడు ఎకరాల్లో నిర్మించనున్న ఈ హాస్పిటల్​కు  రూ.185 కోట్లు ఖర్చు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మూడు అంతస్తుల్లో 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో హాస్పిటల్​ నిర్మాణం జరుగుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు బుధవారం  పర్యవేక్షించారు.