హరీశ్ రావు.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు..హ్యామ్ ప్రాజెక్ట్ పై తప్పుడు ఆరోపణలు చేయకు: మంత్రి కోమటిరెడ్డి 

హరీశ్ రావు.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు..హ్యామ్ ప్రాజెక్ట్ పై తప్పుడు ఆరోపణలు చేయకు: మంత్రి కోమటిరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కేంద్ర రహదారుల శాఖ 2016లో ప్రవేశపెట్టిన ఈ విధానం జాతీయ స్థాయిలో విజయవంతమైందని, ఇప్పటికే ఏడు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు.

తెలంగాణలో కూడా కేంద్ర నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని..ప్రాజెక్ట్‌‌‌‌లో అవినీతి జరుగుతున్నదని హరీశ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రూ. 13,000 కోట్ల పనులపై కేవలం 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ మాత్రమే ఇస్తామని తెలిపిన మంత్రి..అది కూడా వడ్డీతో కలిపి తిరిగి వసూలు చేస్తామని వెల్లడించారు.

కాంట్రాక్టర్లు ముందుగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండటం వల్ల సుమారు 9.30 శాతం అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. హ్యామ్ ఫేజ్-1 టెండర్లలో బిడ్డర్లు 15 నుంచి 23 శాతం వరకు అధికంగా కోట్ చేశారని, అయితే బిహార్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో , ఎన్ హెచ్ఏఐలో కూడా 50 శాతం కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్లకు టెండర్లు ఖరారైన సందర్భాలు ఉన్నాయని, ఈ వాస్తవాలను హరీశ్ రావు గ్రహించాలని కోమటిరెడ్డి  సూచించారు.