కరీంనగర్ సిటీ, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేసిన యువతపై నిర్దాక్షిణ్యంగా పోలీసులతో దాడి చేయించి వందలాది మందికి గాయాలకు కారణమైన కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ సమాధానం చెప్పాలని కరీంనగర్ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాడుకోవడం కాదని, యువత న్యాయం కోసం పోరాటం చేసినప్పుడు చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాత ఆఫీసులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. యువకులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని, ఈ దాష్టీకానికి కారణమైన ప్రధాని మోదీ, అమిత్ షా దేశ యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం సూచించినట్లు యువత 21 ఏండ్లకే చట్టసభలకు వెళ్లేలా బిల్లు రూపకల్పన చేయాలన్నారు. సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజొద్దీన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేశ్, ఎల్లారెడ్డి, ఎం.శ్రీధర్ రెడ్డి, షబానా మహమ్మద్ షెహన్షా, సాయిరాం, ముల్కల యోన, మాసుం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
