తండ్రిని తిట్టిన కవిత.. అమ్మ ఎట్లయితది..కేసీఆర్ వల్లే కవిత, కేటీఆర్, హరీశ్కు గుర్తింపు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తండ్రిని తిట్టిన కవిత.. అమ్మ ఎట్లయితది..కేసీఆర్ వల్లే కవిత, కేటీఆర్, హరీశ్కు గుర్తింపు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కవిత కేసీఆర్​ను తిట్టడం బాధ కలిగించింది
  • ఆమె పార్టీ జోక్.. ఎన్నికల్లో 
  • డిపాజిట్​ కూడా రాదని కామెంట్

చౌటుప్పల్, వెలుగు: తండ్రిని తిట్టిన కల్వకుంట్ల కవిత.. అమ్మ ఎట్ల అయితదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడు, ఆయనను కూతురు కవిత తిట్టడం బాధ కలిగించిందన్నారు. తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి.. ప్రజలకు ఎలా ఆదర్శంగా నిలుస్తారని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన కోఆప్షన్​ మెంబర్లను బుధరవారం రాజగోపాలరెడ్డి అభినందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ వల్లనే కవిత, కేటీఆర్, హరీశ్​రావుకు గుర్తింపు వచ్చిందన్నారు. కేసీఆర్​లేకుండా కవిత ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. ‘కేటీఆర్​తో కవితకు విబేధాలు ఉండొచ్చు.. అధికారం కావాలన్న ఆశ ఉండొచ్చు కానీ తండ్రి కేసీఆర్​ను విమర్శించి ఆమె మర్యాద పోగొట్టుకుంది’ అని అన్నారు. డబ్బులున్నాయని టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ పెట్టారని, పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు  ఉందన్నారు.

వచ్చే  ఎన్నికల్లో ఆమె ఎవరితో కలిసి పోటీ చేసినా ఓడిపోతుందని, డిపాజిట్ కూడా రాదన్నారు. లిక్కర్ కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినందున మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.