కిషన్ రెడ్డీ.. టచ్ చేసి చూడు .. నామరూపాల్లేకుండా చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిషన్ రెడ్డీ.. టచ్ చేసి చూడు ..  నామరూపాల్లేకుండా చేస్తం :   మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. టచ్ చేసి చూడు.. నామరూపాల్లేకుండా చేస్తామన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి ఖిల్లా మీద రోప్ వేసుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రూ. 200 కోట్లు అడిగితే కనీసం స్పందించలేదన్నారు. నాలుగేండ్ల నుంచి ఫైల్ దగ్గర పెట్టుకొని సొంత రాష్ట్రానికి కనీసం రూ. 200 తేలేని మంత్రి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 

కేబినెట్ లో ఉంటూ కనీసం రూ. 200 కోట్ల నిధులు ఇవ్వలేక పోయారని, తాము వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రూ. 3 వేల కోట్ల పనులు తెచ్చుకున్నామన్నారు.  అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదని అన్నారు. రెండు మూడు రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడిన స్పీచ్ ఆడియోలు తన వద్ద ఉన్నాయని, 20 కోట్ల ఉద్యోగాలిస్తానన్న ప్రధాని ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 

బ్లాక్ మనీ తెస్తానన్నప్రధాని తెచ్చారా..? ఓ వైపు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు.  రూ. 500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ. 1200 చేరిందని అన్నారు. నమామి గంగాకు కేంద్రం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసిందని, హైదరాబాద్ లోని మూసీకి నిధులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అందులో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని అన్నారు. శత్రువైన మోదీ దగ్గరికి కేసీఆర్ వెళ్లిన కేటీఆర్ ను ఆశీర్వదించండి అని అడిగారంటే ఇద్దరి మధ్య దోస్తానా కుదిరినట్టేనన్నారు.