
- 16 ఏండ్లు కోర్టుకు తిరుగలే
- నిన్న ఏడాది జిల్లా నుంచి బహిష్కరించిండ్రు
- పంచాయతీ సమితి ప్రెసిడెంట్ మర్డర్ కేసులో నువ్ ఏ2
- మరో హత్య కేసులో నువ్వు, మీ నాయిన ఏ6, ఏ7
- మాజీ మంత్రిని కడిగి పారేసిన మంత్ర కోమటరెడ్డి
- నిరూపించకుంటే పదవికి రాజీనామా చేస్తానని సవాల్
హైదరాబాద్: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయన గత చరిత్రను శాసన సభ ముందుంచారు. తాము తెలంగాణ కోసమే జైలుకు వెళ్లామని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏ కేసులో జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అనడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి చరిత్ర అంతా నల్లగొండ జిల్లా అంతా తెలుసునని అన్నారు. ఆయన చరిత్రంతా కిరాయి హత్యలు, చిల్లర దొంగతనాలేనన్నారు.
ఆ నాటి పంచాయతీ సమితి మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో జగదీశ్ రెడ్డి ఏ2గా ఉన్నారని అన్నారు. వేరే కేసులో మాజీ మంత్రి, వాళ్ల నాయన ఏ6, ఏ7గా ఉన్నారని సభలో వెల్లడించారు. పెట్రల్ బంకుల్లో, రైసుమిల్లుల్లో చోరీలు చేసిన ఘన చరిత్ర జగదీశ్ రెడ్డిదని చెప్పారు. కోర్టు ఏడాది పాటు జిల్లా నుంచి జగదీశ్ రెడ్డిని బహిష్కరించిందని అన్నారు. దీనిపై స్పందించిన జగదీశ్ రెడ్డి మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.
తనను కావాలనే గత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసుల్లో ఇరికించిందన్నరు. మరో మూడింటిలో నిర్దోషిగా బయటికి వచ్చానని తెలిపారు. తనపై మోపిన ఆరోపణలు నిరూపించకుంటే ముక్కు నేలకు రాసిన క్షమాపణ చెప్పాలని జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటరెడ్డి ప్రకటించారు. ఆరోపణలు నిరూపించని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.