
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్‌పై కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి ఒక్కసారే వెళ్ళానని.. అక్కడ జరిగే పరిణామాల గురించి తనకు తెలియదన్నారు. పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తానన్నారు.
టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తానని.. ఎవరి తప్పు ఉన్నా సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తానని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారని.. మళ్లీ ఆమెనే కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని తాను తన భార్య సురేఖ కష్టపడ్డామని.. వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఎవరైనా కావాలని గొడవలు సృష్టిస్తే మాకు సంబంధం లేదన్నారు. మంత్రులు అందరితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అందరి ఇంటికి వెళ్లి మాట్లాడుతానని అన్నారు.
కాగా, మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం (అక్టోబర్ 15) రాత్రి హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. సుమంత్‌ను ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తప్పించిన నేపథ్యంలో బుధవారం రాత్రి11 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చారు.
సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోలీసులు తెలుపడంతో సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చిన సమయంలో కొండా సురేఖ, సుమంత్ ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే సుస్మిత పోలీసులను వారెంట్ చూపాలని నిలదీశారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కారణాలు చూపాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. తమకు సహకరించాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
ఇదంతా జరుగుతుండగానే కొండా సురేఖతో కలిసి ఆమె కారులోనే సుమంత్ కూడా బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఓఎస్డీగా సుమంత్‌ను తొలగించిన తరువాత వరుసగా జరుగుతున్న ఘటనలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండకు వెళ్లిన సమయంలో కొండా సురేఖ హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం ప్రొగ్రామ్‌లో కూడా ఆమె పాల్గొనలేదు.