
చేవెళ్ల, వెలుగు : చేవెళ్లలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ ఎందుకొచ్చిండో ఆయనకే తెలియదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి ఎద్దేవాచేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి అబద్ధాలు చెప్పి గెలిచారో.. వాటినే ఇప్పుడు రిపీట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణకే ఆయన సీఎం అనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ నేతలు నెగిటివ్ ప్రచారం తీసుకెళ్లారన్నారు.
ఇప్పుడిప్పుడే ఆ బురద కడుక్కుని మూడో స్థానం నుంచి ఒకటో స్థానానికి చేరుకున్నామన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల బీజేపీ గెలవనుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అభ్యర్థులు కేఎస్ రత్నం, తోకల శ్రీనివాస్ రెడ్డి, అందెల శ్రీరాములు, రవికుమార్ యాదవ్ గెలవబోతునట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాండు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంత రెడ్డి, పార్టీ నాయకులు శర్వలింగం, వెంకట్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.