కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం (మే10) ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 న హనుమాన్ జయంతి కాగా మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు.
కొండగట్టు వై జంక్షన్ నుండి ఊరేగింపు ప్రారంభమైంది. ఒగ్గు డోలు నృత్యాలు, కోలాటాలు, కళాకారుల ఆటపాటల మధ్య చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కొండగట్టు ఈఓ అంజనా రెడ్డి, భద్రాచలం ఈఓ దామోదర రావు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. వీరికి ఆలయ అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయం నుండి యాగశాలకు తరలించారు.
కట్టుదిట్టంగా ఏర్పాట్లు
మూడు రోజులపాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.1100 ల మంది పోలీసులతో ఏర్పాట్లు చేశారు. జయంతి సందర్భంగా ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
