విమానంలో అరెస్టు చేయడానికి యువకులేమైనా ఉగ్రవాదులా?: కూనంనేని  సాంబశివరావు

విమానంలో అరెస్టు చేయడానికి యువకులేమైనా ఉగ్రవాదులా?: కూనంనేని  సాంబశివరావు
  • దేశ చరిత్రలోనే అత్యంత పిరికి ప్రభుత్వం: కూనంనేని

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ పోలీసులు విమానంలోకి చొరబడి యువకులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. వారేమైనా ఉగ్రవాదులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్‌‌మంతర్‌‌ వద్ద శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన సీజేపీ అధ్యక్షుడు అభిజిత్‌‌ దీప్కేతోపాటు ఇతర యువకులను విమానం నుంచే బలవంతంగా తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత, ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమానికి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న వేలాది మంది యువతను అరెస్టు చేయడం, సరిహద్దుల్లో బీఎస్‌‌ఎఫ్‌‌ దళాలను మోహరించి నిర్బంధించడం ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందన్నారు.