- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పాపన్నపేట/ చిలప్‌చెడ్, వెలుగు: దసరా పండగ సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వగా, 20న రాజరాజేశ్వరి దేవి రూపంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ నెల 15న బోనాలు, 19న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తుల కోసం తొమ్మిది రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు.
చాముండేశ్వరీ ఆలయంలోనూ..
చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన వెలసిన చాముండేశ్వరీ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. తొమ్మిది అడుగుల ఎత్తు, 18 చేతులతో శక్తి స్వరూపిణిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 నుంచి 19 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ, సేవా సమితి సభ్యులు తెలిపారు.
నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, మహా నివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
