- గతంలో పరిశీలించిన స్థలం అనుకూలంగా లేదని ప్రాజెక్టు నిలిపివేత
- రాజ్యసభలో ఎంపీ వద్ది రాజు ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు టెక్నికల్ బ్రేక్స్ పడ్డాయి. ఈ ప్రతిపాదిత స్థలం చుట్టూ కొండలతో పాటు సమీపంలోనే రైల్వే లైన్ ఉండటంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అది సాంకేతికంగా సరిపోదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నివేదించిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం రాజ్య సభలో ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ రాతపూర్వక సమాధానమిచ్చారు.
గతేడాది జనవరిలో ఏఏఐ.. రామావరం, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల సరిహద్దుల్లో ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయన సర్వే నిర్వహించిందని తెలిపారు. కొండలు, రైల్వే ట్రాక్ కారణంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అది సాంకేతికంగా సరిపోదని నివేదించిందని పేర్కొన్నారు. అలాగే, సీతంపేట, సుజాతనగర్ పరిధిలోని 667 ఎకరాల కొత్త స్థలానికి సంబంధించి ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందలేదని మంత్రి స్పష్టం చేశారు.
‘గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ (2008) కింద భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ఎలాంటి ‘సైట్ క్లియరెన్స్’ ప్రతిపాదనలు మాకు అందలేదు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల రూపకల్పన, భూసేకరణతో పాటు నిధులను సమీకరించుకోవడం, ప్రాజెక్టును అమలు చేయడం వంటి బాధ్యతలు ఎయిర్‌పోర్ట్ డెవలపర్‌కే చెందుతాయి’అని స్పష్టం చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లకు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపుల నిబంధన లేదని తన సమాధానంలో పొందుపరిచారు.
