- ఈ నెల 30న 21వ బోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాలకు సమాచారం
- తెలంగాణ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోని బోర్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు తీరు వివాదాస్పదంగా మారుతున్నది. బోర్డు మీటింగ్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. ఏపీ అడిగిందే తడవుగా ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ బోర్డు మీటింగ్‌ను నిర్వహించనున్నట్టు రెండు రాష్ట్రాలకు లేఖలు పంపింది. వాస్తవానికి జనవరిలోనే బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నా.. ఏపీ నిరాకరించడంతో నిర్వహించలేదు.
ఏపీ అడ్డగోలుగా జలదోపిడీకి పాల్పడుతున్నదని, కోటాకు మించి తీసుకెళ్లిందని, బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఏపీని నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం మూణ్నాలుగు సార్లు బోర్డుకు లేఖలు రాసినా ఎలాంటి స్పందనా రాలేదు. అయితే, ఇప్పుడు శ్రీశైలం నుంచి నీటిని దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పొరుగు రాష్ట్రం.. వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిసింది. ఏపీ అలా అడిగిందో లేదో.. కృష్ణా బోర్డు కూడా మీటింగ్‌కు తలూపేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
మిగిలిన నీటిని తోడుకునేందుకు యత్నం..
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు దాదాపు అడుగంటిపోయాయి. డెడ్స్టోరేజీకిపైన కేవలం 3.4 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్‌నుంచి విచ్చలవిడిగా నీటిని వాడేసుకున్న పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు మిగిలి ఉన్న ఆ నీటిని కూడా తోడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాయలసీమ ప్రాంతానికి తాగునీళ్ల పేరిట ఆ జలాలను తరలించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ 3.4 టీఎంసీలు వాడుకునేలా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ.. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని ఇటీవల కృష్ణా బోర్డును ఏపీ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఈ నెల 30న మీటింగ్ ఏర్పాటు చేస్తామంటూ 20న బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు పంపింది.
వాస్తవానికి శ్రీశైలంలో ఏపీ వాడుకోవాల్సిన కోటా కన్నా ఎక్కువ వాడుకున్నదని, ఆ ప్రాజెక్టులో ఏపీకి వచ్చే నీళ్లు లేవని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. ఉన్న నీళ్లన్నీ తమవేననీ స్పష్టం చేసింది. అయినా కూడా ఏపీ తనవి కాని నీళ్లను ఎత్తుకెళ్లే కుట్రలకు తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు మీటింగ్ పెట్టాలన్న ఏపీ.. ఇంతవరకూ ఎజెండాను కూడా పంపలేదు. దీంతో కేవలం తెలంగాణ ఎజెండాను మాత్రమే మీటింగ్ఎజెండాలో బోర్డు చేర్చింది.

