హైదరాబాద్, వెలుగు: ఈనెల 14న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు లేఖలు రాసింది.
వాస్తవానికి 21వ బోర్డు సమావేశం జనవరిలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గత నెల 30న సమావేశం నిర్వహిస్తామని బోర్డు ప్రకటించినప్పటికీ, ఆ రోజు ఇతర కార్యక్రమాలు ఉండటంతో వాయిదా వేయాలని తెలంగాణ కోరింది.
దీంతో ఈనెల 14న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు తమ అజెండాలను సమర్పించాయి. ఏడాది కాలంలో 50:50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని గత సమావేశంలో కోరామని మన అధికారులు అజెండాలో పేర్కొన్నారు.
