కృష్ణానది నుంచి తాగునీటికి మాత్రమే నీళ్లు తీసుకోవాలె

కృష్ణానది నుంచి తాగునీటికి మాత్రమే నీళ్లు తీసుకోవాలె
  • ఏపీకి 25 టీఎంసీలు, తెలంగాణకు6 టీఎంసీలకు కేఆర్​ఎంబీ పర్మిషన్​ 
  • అంతకు మించి తీసుకోవద్దని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిలో ప్రవాహాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఎక్కువగా లేనందున తాగునీటికి మాత్రమే నీళ్లు తీసుకోవాలని కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. ఈ నెలాఖరు వరకు ఏపీ తాగునీటి అవసరాలకు 25.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలు తీసుకునేందుకు  త్రీ మెంబర్ కమిటీ మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఆగస్టు 21న నిర్వహించిన కేఆర్ఎంబీ త్రీమెంబర్ కమిటీ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ హాజరుకాలేదు. కానీ, ఆ మీటింగ్ లో చర్చించిన అంశాలతో కూడిన నోట్ పంపగా.. తన అభిప్రాయాలను లెటర్​ద్వారా తెలియజేశారని కృష్ణా బోర్డు వెల్లడించింది.

 తెలంగాణ ఈఎన్సీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన మీటింగ్ మినిట్స్ శనివారం రిలీజ్ చేసింది. త్రీమెంబర్ కమిటీ సమావేశంపై తాము ప్రతిపాదించే తుది ముసాయిదా ఇదేనని, దీనిపై సంతకాలు చేయాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలను కోరింది. ఏపీకి నాగార్జున సాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలు, ఎడమ కాలువకు ఒక టీఎంసీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 13.29 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 6 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణకు నాగార్జున సాగర్ నుంచి ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీకి 3.42 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 1.83 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1.24 టీఎంసీలు తీసుకునేందుకు ఓకే చెప్పింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ కు వరద లేనందున పవర్ జనరేషన్, ఇరిగేషన్ అవసరాలకు నీటిని తరలించవద్దని సూచించింది.