శతకం బాదిన తెలుగు కుర్రాడు..రామునికి అంకితం

శతకం బాదిన తెలుగు కుర్రాడు..రామునికి అంకితం

స్వదేశంలో ఇంగ్లాండ్ తో మరో ఐదు రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్..ఇంగ్లాండ్ లయన్స్ పై జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. రెండో ఇన్నింగ్స్‌లో భరత్ 165 బంతుల్లో 116 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. భరత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.   

ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 10 సెంచరీలు పూర్తి చేసుకున్న భరత్..తన సెంచరీని రాముడికి అంకితం చేశాడు. జనవరి 22న అయోధ్య టెంపుల్ ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 553 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌట్ అయింది. రజత్ పాటిదార్ (151) ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో భారత్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ క్లాస్ ఆట తీరును ప్రదర్శించింది. భరత్‌తో పాటు సాయి సుదర్శన్ (97), మనవ్ సుతార్ (89) రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్-ఏ జట్టు 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా..   ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జనవరి 25న జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు జరుగుతాయి.