ఓర్వలేకనే కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ అక్రమ కేసులు: కేటీఆర్

ఓర్వలేకనే కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ అక్రమ కేసులు: కేటీఆర్

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చబడుతుంటే.. కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేండ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే.. ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా ఆయనపై అక్రమ కేసులు పెడుతూ బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు. 

సీబీఐని మోదీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే.. రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్​లో మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని అన్నారు. 

హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని తెలిపారు. అయినా సింగరేణి ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. 

పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్​లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రాచలం, కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్టు కేటీఆర్​ తెలిపారు.