కాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్‌‌

కాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్‌‌
  •     రాజకీయ కారణాలతో డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్నరు: కేటీఆర్‌‌
  •     రైల్వే, ఐటీ, సెమీ కండక్టర్లు సహా పలు అంశాలపై ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్

న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధిని రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ ఆరోపించారు. విద్యా సంస్కరణల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైల్వే ప్రాజెక్టుల నుంచి ఐటీ, సెమీకండక్టర్ల పెట్టుబడుల వరకు పలు కీలక అంశాలపై సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. 

దేశంలో విద్యా సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్ కమిటీ నివేదిక ఏమైందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వెల్లడించడం లేదని అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ కృషితో మంజూరైన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్లుగా వాటి పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. 

హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గాన్ని విద్యుదీకరించడంతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్‌లాంటి జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మించి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిందని ఆరోపించారు. పరకాలలాంటి చిన్న పట్టణంలోనే ఒక యువ పారిశ్రామికవేత్త 250 ఉద్యోగాలు కల్పించినప్పుడు.. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. 

స్కైరూట్‌ రాకెట్ సక్సెస్‌లో యువత కీలక పాత్ర..

స్కైరూట్ రాకెట్ విజయానంతరం సంస్థ వ్యవస్థాపకులు స్వయంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆనందాన్ని కలిగించిందని కేటీఆర్ చెప్పారు. ఎలాన్ మస్క్ ఎన్నో సంవత్సరాల ప్రయత్నంలో సాధించలేని విజయాన్ని స్కైరూట్ తొలి ప్రయత్నంలోనే సాధించిందని, ఇందులో తెలంగాణ యువత కీలక పాత్ర పోషించిందన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెమీ కండక్టర్ అనుబంధ పరిశ్రమలకు పునాది పడిందని, అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లించిందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులపై ఇంకా పూర్తి సమాచారం లేదని కేటీఆర్ అన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలతో రహస్యంగా సమావేశమవుతున్నారని ఆరోపించారు.