సుంకిశాల, ఎస్ఎల్​బీసీ పైవిచారణ జరిపించాలి : కేటీఆర్​

సుంకిశాల, ఎస్ఎల్​బీసీ పైవిచారణ జరిపించాలి : కేటీఆర్​
  • రేవంత్​ను కేంద్రం ఎందుకు కాపాడుతున్నది?: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్​కు రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ఆరోపించారు. ఢిల్లీలో రాజకీయంగా కొట్లాడుతున్నా.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్​ సీఎంకు అన్ని రకాలుగా కాపు కాస్తున్నదని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు.

ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపై ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి విచారణలంటూ వేధింపులకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వం.. కాంగ్రెస్​ హయాంలో సుంకిశాల ఇన్​టేక్​ వెల్​ప్రమాదం, ఎస్​ఎల్​బీసీ సొరంగంలో పెను ప్రమాదాలపై మాత్రం కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎన్ డీఎస్ఏని రంగంలో దించినట్టుగానే.. సుంకిశాల, ఎస్​ఎల్​బీసీ ప్రమాదాలపైనా ఎన్​డీఎస్​ఏతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

బీజేపీపై పోరాటం చేస్తున్నామంటూ రాహుల్​ గాంధీ చెప్తున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్న విషయం అనేకసార్లు స్పష్టమైందన్నారు. అసలు రేవంత్​ను కేంద్రం ఎందుకు కాపాడుతున్నదన్న అంశం మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మారిందని కేటీఆర్ అన్నారు. బీజేపీలో చేరుతానని సీఎం రేవంత్​లోపాయికారి ఒప్పందం చేసుకోవడంతోనే కేంద్రం కాపాడుతున్నదని ఆరోపించారు.