- పైశాచికానందం కోసమేకేసీఆర్ను తిడుతున్నరని కామెంట్
- నేడు పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కుట్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని, వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం సహా కొందరు తమకు సరైన గుర్తింపు రావడం లేదనే మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాజీ సీఎం కేసీఆర్ పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఏదో నాలుగు మాటలు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారన్నారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మొన్నటికి మొన్న సీఎం పేరును గుర్తుంచుకోలేక ఓ యాంకర్ మంత్రి శ్రీధర్ బాబు పేరును ప్రస్తావించిందని గుర్తు చేశారు. యాక్టర్లు, యాంకర్లు మాత్రమే కాదు చివరికి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి సిద్ధంగా లేరన్నారు. కాగా, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా పార్టీ ఆఫీసుల్లో జెండాలను ఎగురవేయాలని కేడర్‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే ఈ సమావేశానికి రావాలన్నారు.

