- స్టాక్ లో ఉండాల్సిన 40 లక్షల టన్నుల బొగ్గును అప్పనంగా అమ్మేసుకున్నరు
- కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో రూ.1,600 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని.. ఈ స్కాంపై విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ శుక్రవారం కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి అధికారిక వెబ్సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడాన్ని బట్టి ఈ కుంభకోణం జరిగిందనే అనుమానాలున్నాయన్నారు.
40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్ సెస్ తోపాటు, ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకండా సాక్షాత్తూ బొగ్గు గనుల శాఖ చూస్తున్న మీ హయాంలో ఇలాంటి కుంభకోణం జరగడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలోనే బొగ్గు గనులపై నిలువలను తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారుల బృందాలు రాకపోవడం, కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయనే అనుమానం కలుగుతోందన్నారు.
సింగరేణిని కబళిస్తున్నరు..
సింగరేణిలో కోరుకున్న వారికి టెండర్లు కట్టబెట్టే కుట్ర అమలుచేశారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని తేలినా ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదన్నారు. నైనీ కోల్ స్కామ్‌ను బీఆర్ఎస్ బయటపెట్టగానే టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించినా అక్రమార్కులపై చర్యలు లేవన్నారు.
107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లను అధిక ధరలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని రద్దుచేసి అందులోనూ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. మెస్సీతో సీఎం ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ.110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్,- బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమన్నారు.
